ఇరాన్‌లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండను తక్షణం నిలిపివేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్‌లో జరుగుతున్న ఎన్నికల హింసాకాండను జి-8 దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారు. ఈ హింసాకాండను తక్షణం నిలిపివేయాలని పిలుపునిచ్చారు.
ఇటలీలో శుక్రవారం జి-8 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీర్మానించిన వివరాలను ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాంకో ఫ్రాటినీ వెల్లడించారు. ఇరాన్‌లో హింసాకాండను వెంటనే నిలిపివేయాలని జి-8 దేశాలు కోరుకుంటున్నాయని తెలిపారు. ఇరాన్ హింసాకాండ బాధితులకు సానుభూతి తెలియజేశారు.
ఇరాన్‌లో రెండు వారాల క్రితం జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళన కారణంగా ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికవడంపై ఆయన ఎన్నికల ప్రత్యర్థులు ఈ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లో నెలకొన్న రాజకీయ పరిష్కారానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని జి- 8 దేశాల విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు. ఇరాన్ ఎన్నికల హింసాకాండలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.