ఆందోళనకారులను రెచ్చగొట్టారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సంజానీ చిన్న కుమార్తె అధికారిక నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ చేసి తిరిగి గెలిచారని ఆరోపిస్తూ గత కొన్ని రోజులగా ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
నిరసనకారులను రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఇరాన్ అధికారిక యంత్రాంగం శనివారం రాత్రి రఫ్సంజానీ చిన్న కుమార్తెను, మరో నలుగురు ఆయన బంధువులను అరెస్టు చేసింది. రఫ్సంజానీ కుమార్తె ఫయాజ్ రఫ్సంజానీని నిర్బంధం నుంచి విడిచిపెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఆదివారం వెల్లడించింది.
దీనికి సంబంధించి ఇతర వివరాలేవీ ఆ టెలివిజన్ వెల్లడించలేదు. ఇదిలా ఉంటే అనధికారిక నిరసన ర్యాలీలో పాల్గొని ఆమెతోపాటు అరెస్ట్ అయిన నలుగురు బందువులను ఇప్పటికే విడుదలయ్యారు. ఫయాజ్ రఫ్సంజానీ, ఆమె సోదరుడు మెహ్దీలను దేశం విడిచివెళ్లకుండా అధికారిక యంత్రాంగం గత వారం ఆదేశాలు జారీ చేసింది.