తమ దేశంలో అశాంతికి పశ్చిమదేశాలు, వాటి మీడియా ఆజ్యం పోస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఇరాన్‌లో నిరసన పదర్శనలు వెల్లువెత్తడం వెనుక ఈ దేశాల హస్తం ఉందని పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ.. ఇరాన్‌లో జూన్ 12 నుంచి పెద్దఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇరాన్‌లో జూన్ 12న వివాదాస్పదరీతిలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అహ్మదీనెజాద్ వరుసగా రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రత్యర్థులు ఫలితాలను అంగీకరించలేదు. ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
వీరికి వేలాది మంది మద్దతుదారులు అండగా నిలవడంతో ఇరాన్‌లో గత పది రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు సుమారు 20 మంది మృతి చెందారు.
తాజాగా ఇరాన్‌లో పరిస్థితులపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి హసాన్ ఖష్కావీ మాట్లాడుతూ.. దేశంలో అశాంతికి పశ్చిమదేశాలు, వాటి మీడియా ఆజ్యం పోస్తున్నాయని, ఇందులో వాటి ప్రమేయం ఉందని ఆరోపించారు. వీటిని తమ ప్రభుత్వం సహించబోదన్నారు.