ఇరాన్లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై ఆందోళన నిర్వహిస్తున్న మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి తాను వెనక్కు తగ్గబోనని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 12న జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అహ్మదీనెజాద్ పెద్దఎత్తున రిగ్గింగ్ ద్వారా తాజా ఎన్నికల్లో విజయం సాధించారని మౌసావి ఆరోపిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని గత పది రోజులుగా ఇరాన్లో ఆందోళన కార్యక్రమాలకు మౌసావి నేతృత్వం వహిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాల కారణంగా ఇరాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన ఆందోళనను విరమించుకోబోనని మౌసావి గురువారం పునరుద్ఘాటించారు.
అంతకుముందు ఆయనను కలిసిన 70 మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులను ఇరాన్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. అంతేకాకుండా నిరసన కార్యక్రమాలను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్ష బాధ్యతలకు తిరిగి ఎన్నికయిన మహమౌద్ అహ్మదీనెజాద్ మాట్లాడుతూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. బరాక్ ఒబామా, ఇతర పశ్చిమ దేశాల నేతలు ఇరాన్లో అశాంతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.