ఇరాన్ ఎన్నికల సంఘం సోమవారం అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లపై పాక్షిక రీకౌంటింగ్ జరిపింది. ఈ నెల 12న ఇరాన్‌లో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ విజయం సాధించడంపై ఆయన ప్రత్యర్థులు పెద్దఎత్తున్న ఆందళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎన్నికల సంఘం బ్యాలెట్లపై సోమవారం పాక్షిక రీకౌంటింగ్ జరిపింది.
ఈ రీకౌంటింగ్‌లో జూన్ 12నాటి ఎన్నికలకు న్యాయబద్ధత ఉందని దేశంలో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ కార్యదర్శి అయతుల్లా అహ్మద్ జన్నాటీ సమక్షంలో ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లలో పది శాతం బ్యాలెట్లను సోమవారం తిరిగి లెక్కించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు బయటపడలేదని ఆ శాఖ స్పష్టం చేసింది.
నెజాద్ ఎన్నిక న్యాయబద్ధంగానే జరిగిందని తెలిపింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో అహ్మదీనెజాద్ విజయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న ఇరాన్ మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావీ తాజా పాక్షిక రీకౌంటింగ్‌ను తోసిపుచ్చారు. ఎన్నికల్లో అసలైన విజేతను తానేనని, నెజాద్ కాదని పునరుద్ఘాటించారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.