ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భద్రతా దళాలకు, నిరసనకారుల మధ్య పెద్దఎత్తున ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి అధికారిక యంత్రాంగం 457 మందిని అరెస్టు చేసింది. ఈ నెల 12న జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ ప్రత్యర్థులు నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తున్నారు.
1969 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్లో ఈ స్థాయిలో అశాంతి నెలకొనడం ఇదే తొలిసారి. వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలు గత పది రోజులుగా టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులగా జరిగిన ఘర్షణల్లో పది మంది మృతి చెందారు. ఈ హింసాత్మక ఘర్షణలకు సంబంధించి వందలాది మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ప్రధాని మీర్ హుస్సేన్ మౌసావి నేతృత్వంలో ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. నిరసన ప్రదర్శనలో శనివారం సంభవించిన మరణాలను మౌసావి ఖండించారు. అయితే నిరసన ప్రదర్శనలు నిలిపివేసేందుకు ఆయన నిరాకరించారు. నిరసనలకు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. హింసకు దూరంగా ఉండాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.