ఇరాన్లో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఇటీవల దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. దేశంలో ఎన్నికలను పర్యవేక్షించే గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధి అబ్బాసాలీ కడ్కోడాయ్ శుక్రవారం మాట్లాడుతూ.. జూన్ 12నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలేమీ జరగలేదన్నారు.
ఈ ఎన్నికల్లో అహ్మదీనెజాద్ తిరిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో నాలుగేళ్లపాటు ఆయన అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు తాజా ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అహ్మదీనెజాద్ రిగ్గింగ్ చేసి గెలిచారని ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాకుండా వారు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలతో గత రెండు వారాలుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అక్రమాలేమీ జరగలేదన్నారు. గత పది రోజులుగా ఎన్నికల ప్రక్రియను అబ్బాసాలీ పరిశీలించారు. తమ పరిశీలనలో అవకతవకలేవీ కనిపించలేదన్నారు.