ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని కిర్‌కుక్ నగరంలో మంగళవారం కారు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబు దాడిలో 24 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. నగరంలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో ఈ బాంబు దాడి జరిగింది. ఇదిలా ఉంటే మంగళవారం ఇరాక్ నగరాల్లో భద్రతను అమెరికా సైన్యం స్వదేశీ సైన్యాన్ని అప్పగించింది.
ఇరాక్‌లోని ప్రధాన నగరాలను అమెరికా సైన్యం ఖాళీ చేసింది. అమెరికా సైన్యం నగరాల బయట ఉన్న స్థావరాలకే పరిమితమైంది. ఇటీవల ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాక్ నగరాల్లో శాంతి, భద్రతల పరిరక్షణను ఇరాకీ సేనలు హస్తగతం చేసుకున్నాయి. అమెరికా సైన్యం నగరాల్లో శాంతిభద్రతల విధులను తప్పుకున్న తొలిరోజే ఈ కారు బాంబు దాడి జరిగింది.
నగరాల్లో శాంతి, భద్రతల పరిరక్షణ ఇరాకీ సేనలకు కత్తిమీద సాములాంటిదే. తీవ్రవాదులు తరుచుగా సమస్యాత్మక ప్రాంతాల్లో కారు బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు చేస్తుండటం ఇప్పటికీ కొనసాతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాక్ సేనలు దేశంలోని ప్రధాన నగరాల శాంతి, భద్రతల బాధ్యతలు స్వీకరించడంతో ఆ దేశ ప్రభుత్వం జులై 30ని జాతీయ సార్వభౌమ దినంగా ప్రకటించింది. దీంతో ఇరాక్ పౌరులు మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో సంబరాలు జరుపుకున్నారు.