ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్రకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విచారణ గురువారం ప్రారంభం కానుంది. ఆరేళ్ల క్రితం ఇరాక్ యుద్ధంలో అమెరికాతో పాలుపంచుకోవాలని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాన్ని ఆ దేశంలో విమర్శించినవారే ఎక్కువగా ఉన్నారు.
అమెరికా నేతృత్వం జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్ పాత్రపై తదనంతర కాలంలో విచారణ జరపాలని అనేకసార్లు డిమాండ్లు వచ్చాయి. బ్రిటన్‌లో అధికార పక్షం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,, తమ మీద పడ్డ మచ్చను చెరిపేసుకునేందుకు ఇరాక్ యుద్ధంలో తమ పాత్రపై విచారణ జరపాలని నిర్ణయించారు.
ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఇటీవల మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ దర్యాప్తులో నిఘా సమాచారాన్ని వక్రీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సబబేనని తెలిపే ప్రయత్నాలు జరుగుతాయని విమర్శకులు భావిస్తున్నారు.