ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న జాత్యహంకార దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా మరో భారతీయ సిక్కు విద్యార్థిపై జాతివివక్ష దాడి జరిగింది. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరిగిన 20వ దాడి ఇది. 22 ఏళ్ల సిక్కు యువకుడిని లక్ష్యంగా చేసుకొని ఆరుగురు ఆస్ట్రేలియా టీనేజర్లు దాడి చేశారు.
వారు దాడికి మందు సిక్కు విద్యార్థి తలపాగా తీసేందుకు, జట్టు కత్తిరించేందుకు ప్రయత్నించారు. బాధితుడు రేషమ్ సింగ్ అనే భారతీయ సిక్కు విద్యార్థి ఆరు నెలల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆతిథ్య కోర్సు చదివేందుకు మెల్‌బోర్న్‌లోని ఓ కళాశాలలో చేరాడు. ఇతనిపై సోమవారం డాన్‌బెనోంగ్ స్టేషన్ వద్ద దాడి జరిగింది.
గడిచిన నెల రోజుల్లో ఆస్ట్రేలియన్ల దాడిలో గాయపడిన 20వ వ్యక్తి రేషమ్ సింగ్. ఇంగ్లీషు సరిగా మాట్లాడటంరాని సింగ్ తనపై జరిగిన దాడి విషయాలను పంజాబీలో వివరించాడు. మొదట కొందరు ఆస్ట్రేలియా టీనేజర్లు తనను దుర్భాషలాడి వెళ్లారు. అనంతరం మరికొందరితో కలిసి తిరిగివచ్చిన వారు రెండు కత్తెరలతో తలపాగా తీసేందుకు, జట్టు కత్తిరించేందుకు ప్రయత్నించారని సింగ్ తెలిపాడు.
తనను ఆస్ట్రేలియా పంపిన ఏజెంట్ ఇక్కడ ఎదురయ్యే దుశ్చర్యల ఎటువంటి వివరాలు చెప్పలేదని సింగ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే రేషమ్ సింగ్‌పై దాడి చేసిన టీనేజర్లలో కొందరిని పోలీసులు ఆ వెంటనే అరెస్టు చేశారు. తాజా దాడికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని విక్టోరియా పోలీసులు వెల్లడించినప్పటికీ, వారి వివరాలు మాత్రం చెప్పలేదు.