ఆస్ట్రేలియాలో ఓ కళాశాల విఫలమవడంతో సుమారు 300 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. వీరిలో ఎక్కువ మంది భారత్, నేపాల్ దేశాలకు చెందినవారున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర విద్యా శాఖ అధికారిక యంత్రాగం మెల్‍బోర్న్ ఇంటర్నేషనల్ కళాశాల విద్యా లైసెన్స్‌ను రద్దు చేసింది.
అక్రమ ప్రైవేట్ ట్రైనింగ్ కళాశాలలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. దీనికి సంబంధించిన చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ కళాశాల లైసెన్స్‌ను ఆస్ట్రేలియా అధికారిక యంత్రాంగం రద్దు చేసింది. అయితే ఈ కళాశాలలో ఉన్న 300 మంది విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.
ఇటీవల నెలల్లో భారతీయ విద్యార్థులపై వరుసగా జరిగిన దాడులను మీడియా తీవ్రంగా పరిగణించడంతో, భారీమొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్న విదేశీ విద్యార్థుల పరిశ్రమను కాపాడేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్గత ఒత్తిళ్లు ఎదుర్కొంటుంది. అక్రమ విద్యాసంస్థల ద్వారా విదేశీ విద్యార్థుల మోసపోతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అటువంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు చేపట్టింది.