అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆసియా ఖండంలో రెండోసారి పర్యటిస్తున్న హిల్లరీ క్లింటన్ అమెరికా గత పోకడలను పక్కనబెట్టి సరికొత్త పంథాలో ముందుకెళుతున్నారు. గతంలో అమెరికా నేతలకు తమ ఉద్దేశాలను ఎలాగైనా ఇతర దేశాలపై రుద్దడం అలవాటుగా ఉండేది. అమెరికాతో సంబంధాలు గతంలో దాదాపుగా ఏకపక్షంగా సాగేవనడం కూడా అతిశయోక్తి కాదు.
దీనికి భిన్నంగా ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ పర్యటన సాగుతోంది. హిల్లరీ క్లింటన్ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాలో అమెరికా మళ్లీ అడుగుపెట్టిందని వ్యాఖ్యానించారు. థాయ్ పర్యటనలో ఆమె ఉత్తర కొరియా, మయన్మార్ పరిస్థితులపై జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడంతోపాటు, ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం ఆసియా దేశాలపై పటిష్ట బంధాన్ని నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల కారణంగా ఆసియా దేశాలు తమకు దూరం కాకుండా ఉండేందుకు దౌత్యమార్గం ద్వారా ప్రయత్నాలు చేపట్టింది. ఆసియా ప్రాంతంతో భాగస్వామ్యాన్ని మరింత లోతుల్లోకి తీసుకెళ్లాలని అమెరికా కోరుకుంటున్నట్లు హిల్లరీ తాజా పర్యటనలో విస్పష్టంగా చెబుతున్నారు.