తమ దేశ ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ ఖియానీని మార్చే ఉద్దేశం లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అమెరికా చేసిన 7.5 బిలియన్ డాలర్ల రుణసాయం అందజేసేందుకు అమెరికా షరతు విధించింది. ఇందులోభాగంగా ఆర్మీలోని కీలక ఉన్నతాధికారులను మార్చనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఖియానీని మార్చవచ్చని ఊహాగానాలు చెలరేగాయి.
రావల్పిండి సమీపంలోని ఛక్లాలా మిలిటరీ ఎయిర్‌బేస్ వద్ద ఆ దేశ సమాచార శాఖామంత్రి ఖమరా జమాన్ కైరా మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్‌ను మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.
సాయం అందించేందుకు అమెరికా విధించిన షరతులు ఆర్మీ కార్యకలాపాలకు ప్రధాన అడ్డంకిగా ఉంటాయని అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించేందుకు పీపీపీకి చెందిన సీనియర్ నేతలు ముందుకు రావడంలేదు.