చైనాతో ఆయధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వచ్చిన వార్తలను శ్రీలంక విదేశాంగ మంత్రి రోహితా బోగోల్లాగమా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆయన.. శనివారం చైనా డైలీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీలంక, చైనా దేశాలు సంప్రదాయ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధిలో ఇరు దేశాలు సహకారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య 1957 నుంచి సబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
అంతేకాకుండా ఎల్టీటీఈపై లంక సైనికులు సాగించిన పోరుకు చైనా ఆయుధాలు సమకూర్చిందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఇందులో నిజం లేదని చెప్పారు. అయితే, మానవతా కోణంలో చైనా సాయం అందించిందని తెలిపారు.
లంకలో సాగిన పోరు వల్ల నిరాశ్రయులైన ప్రజలకు ఆదుకునేందుకు చైనా మిలియన్ డాలర్లను అందజేసింది. ముఖ్యంగా, ఆశ్రయం కోల్పోయిన వారికి టెంట్లను నిర్మించేందుకు 2.9 మిలియన్ డాలర్లను అందజేసింది.