ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం జరిగిన బాంబు దాడిలో 11 మంది అమాయక పౌరులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు బాలలు కూడా ఉన్నారని సరిహద్దు పోలీసు అధికారులు తెలిపారు. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్డుపక్కన అమర్చిన బాంబు పేల్చడంతో బాధితులు ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. ఇదిలా ఉంటే మరో బాంబు పేలుడులో బ్రిటన్ సైనికుడొకరు మృతి చెందారు.
కాందహార్ ప్రావీన్స్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో కొంత మంది యాత్రికులు వాహనంలో ప్రార్థనా స్థలానికి వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడుకు తాలిబాన్ తీవ్రవాదులే కారణమని అధికారిక వర్గాలు ఆరోపించాయి.
ఆఫ్ఘనిస్థాన్, విదేశీ సేనలను లక్ష్యంగా చేసుకునేందుకు తీవ్రవాదులు తరచుగా మందుపాతరలతో దాడులకు పాల్పడుతుంటారు. తాజా దాడికి కూడా వారే కారణమయి ఉంటారని అధికారులు తెలిపారు. దాడిలో మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ ఏడాది దేశంలో ఇటువంటి దాడులు గణనీయంగా పెరిగాయని ఆఫ్ఘన్ అధికారులు చెప్పారు.