ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం ఐదు రాకెట్ దాడులు జరిగాయి. వీటిలో ఒక రాకెట్ అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో పేలింది. కాబూల్‍లో అనూహ్యంగా ఈ రాకెట్ దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. మరో మూడు వారాల్లో దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా రాజధానిలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నగర తూర్పు భాగంలో దాడులు జరిగాయని పోలీసులు, ప్రత్యేక్ష సాక్షులు చెప్పారు. దాడులు జరిగిన ప్రదేశాలు అంతర్జాతీయ విమానాశ్రయం, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉన్నాయి. అమెరికా దౌత్యకార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనూ ఓ రాకెట్ దాడి జరిగింది. అమెరికా దౌత్యకార్యాలయం సెంట్రల్ కాబూల్‌లోని ప్రధాన రోడ్డుపై ఉంది. ఈ రాకెట్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఇంటిలోకి దూసుకెళ్లింది.
ఈ దాడిలో ప్రాణనష్టమేమీ సంభవించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎం1 శ్రేణి రాకెట్లను తాజా దాడులకు తీవ్రవాదులు ఉపయోగించారని భద్రతా యంత్రాంగం భావిస్తోంది. నగరం మొత్తం భద్రత పటిష్టంగా ఉందని, ఈ రాకెట్లు చాలా దూరం నుంచి ప్రయోగించి ఉంటారని అధికారులు తెలిపారు. ఈ తరహా రాకెట్‌లను లక్ష్యానికి కొన్ని మైళ్ల దూరం నుంచి ప్రయోగించే అవకాశం ఉందని చెప్పారు.