ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు చేస్తున్న యుద్ధాన్ని ఎక్కువ మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ సర్వే నివేదిక ప్రకారం.. ఆఫ్ఘన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ యుద్ధం వలన ఉపయోగం ఉండదని అమెరికన్లు ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు.
నాలుగింట ఒక వంతు మంది పౌరులు మాత్రమే ఆఫ్ఘనిస్థాన్‌కు మరిన్ని దళాలను పంపడాన్ని సమర్థిస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్- ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది అమెరికన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న యుద్ధం వలన ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. గత నెలతో పోలిస్తే వీరి సంఖ్య ఆరు శాతం పెరిగింది. మార్చి నుంచి పది శాతం పెరిగింది.