ఆఫ్గనిస్థాన్‌లోని తూర్పు ప్రాంతంలో మంగళవారంనాడు జరిగిన బాంబు పేలుళ్ళతో అమెరికాకు చెందిన నలుగురు సైనికులు మృతి చెందారు.
రోడ్డు ప్రక్కన ఉంచిన బాంబును గుర్తు తెలియని దుండుగులు రిమోట్ కంట్రోలుతో పేల్చివేశారు. దీంతో ఆఫ్గనిస్థాన్‌లో ఈ ఒక్క నెలలోనే మృతి చెందిన అమెరికాకు చెందిన సైనికులు దాదాపు 30కి చేరింది.
ఇదిలావుండగా మంగళవారం ఉదయం గార్దెజ్, జలాలాబాద్ పట్టణాలలోనున్న ప్రభుత్వ కార్యాలయాలపై ఎనిమిదిమంది తాలిబన్‌కు చెందిన మానవబాంబులు విరుచుకుపడ్డాయి. వీరు జరిపిన దాడులలో ఆరుగురు ఆఫ్గనిస్థాన్‌కు చెందిన భద్రతా సిబ్బంది మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా ఈ దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్ తీవ్రవాదులు ప్రకటించారు.