శాంతి ప్రక్రియను ముందుకు తీసుకుపోవడంలో విఫలమయినందుకు గానూ పదవి నుంచి వైదొలగాలని తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధానమంత్రి ఝలానాథ్ ఖానల్ ఆగస్ట్ 13న రాజీనామా చేయనున్నట్లు నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి బుధవారం పేర్కొన్నారు. కాగా నేపాల్ మావోయిస్ట్ పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు, నేషనల్ కాంగ్రెస్ నాయకులు జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆగస్ట్ 13న ప్రధాన మంత్రి రాజీనామా చేస్తారని ప్రభుత్వ ప్రతినిధి, విద్యా మంత్రి గంగా లాల్ తులాధర్ బుధవారం పాత్రికేయులతో తెలిపారు. జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు గానూ ఖానల్ వైదొలగుతున్నట్లు తులాధర్ చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇంతకంటే మార్గం లేదని సీపీఎన్-యూఎంఎల్ నాయకుడు కూడా అయిన తులాధర్ తెలిపారు.
పార్లమెంట్లో 17 రౌండ్ల పాటు జరిగిన ఓటింగ్ తర్వాత ఫిబ్రవరి 3న ఖానల్ నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆగస్ట్ 13లోపు శాంతి ప్రక్రియలో పురోగతి కనిపించకపోతే రాజీనామా చేస్తానని ఖానల్ గత నెలలో స్పష్టం చేశారు.