అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ వచ్చే నెలలో ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె మొత్తం ఏడు దేశాలను సందర్శిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫ్రికా ఖండానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టారు.
బరాక్ ఒబామా జులై 12న ఆఫ్రికాలోని ఘనా దేశంలో స్వయంగా పర్యటించారు. ఇదిలా ఉంటే హిల్లరీ క్లింటన్ తాజా ఆఫ్రికా దేశాల పర్యటనలో ఆగస్టు 5న కెన్యా వెళతారు. బరాక్ ఒబామా తండ్రి దేశం కూడా ఇదే. అనంతరం అక్కడి నుంచి దక్షిణాఫ్రికా, అంగోలా, కాంగో రిపబ్లిక్, నైజీరియా, లిబేరియా, కేప్ వెర్డే దేశాల్లోనూ ఆమె పర్యటిస్తారని హిల్లరీ ప్రతినిధి ఇయాన్ కెల్లీ ఓ ప్రకటనలో వెల్లడించారు.