Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అహ్మదీనెజాద్ అధ్యక్ష ఎన్నికకు ఆమోదం

Advertiesment
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు
మహమౌద్ అహ్మదీనెజాద్ అధ్యక్ష ఎన్నికను ఇరాన్ సుప్రీం నేత ఆమోదించారు. ఇటీవల ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో నెజాద్ భారీ ఎత్తున రిగ్గింగ్ చేసి అక్రమ మార్గంలో విజయం సాధించారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలతో నెజాద్ వ్యతిరేక వర్గాలు ఇరాన్‌లో కొన్నివారాలపాటు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వివాదాస్పదంగా మారిన అధ్యక్ష ఎన్నికల్లో నెజాద్ విజయాన్ని ఇరాన్ సుప్రీం నేత సోమవారం ఆమోదించారు. నెజాద్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తూ జూన్ 12న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఇరాన్ సుప్రీం నేత (అయతుల్లా అలీ ఖమేనీ) ఆమోదించారని అల్ ఆలం అనే ప్రభుత్వ టీవీ ఛానల్ వెల్లడించింది.

అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆందోళనను విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన హింసాత్మక ఆందోళనలో సుమారు 20 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం చట్టవిరుద్ధమైనదని నెజాద్ ఎన్నికల ప్రత్యర్థులు మీర్ హుస్సేన్ మౌసావి, మెహ్ది కరౌబి విమర్శిస్తున్నారు.

మరోవైపు ఇటీవలి ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 40 మిలియన్ ఓట్లు పోలవగా, అహ్మదీనెజాద్‌కు 63 శాతం ఓట్లు లభించాయి. ఆయన ప్రధాన ప్రత్యర్థి మౌసావికి 34 శాతం ఓట్లు వచ్చాయి. ఇరాన్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి అహ్మదీనెజాద్ బుధవారం ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం రెండు వారాల్లోగా నెజాద్ తన కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేయాల్సివుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu