అయ్యబాబోయ్.. నేను అంత అందంగా ఉన్నానా: ఖర్
, శనివారం, 30 జులై 2011 (10:11 IST)
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 34 యేళ్ళ అందాల ముద్దుగుమ్మ భారతీయ మీడియాపై ఒకవైపు ప్రశంసలు.. మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన న్యూఢిల్లీ పర్యటన సమయంలో తన అందానికి అమిత ప్రాధాన్యత ఇవ్వాడాన్ని ఆమె మెచ్చుకున్నప్పటికీ... ఎక్కువ శాతం నొచ్చుకున్నారు. భారత్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇస్లామాబాద్‌కు చేరుకున్న మంత్రి హినా రబ్బానీ ఖర్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. న్యూఢిల్లీ పర్యటనలో తాను చేసిన ప్రకటనలను భారత మీడియా "ఫ్యాషన్ స్టేట్‌మెంట్" అంటూ అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. అదేసమయంలో తన అందం, దుస్తులు, మేకప్, కళ్లజోళ్ళు, బ్యాగు తదితర అంశాలపై చూపెట్టిన శ్రద్ధాసక్తులు తమ చర్చల సారాంశంపై చూపెట్టలేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా.. భారత మీడియాకు తాను అంత అందంగా కనిపించడం అదృష్టంగా భావిస్తున్నప్పటికీ వ్యక్తిగత విషయాలపై ఇంత శ్రద్ధ చూపడం మంచిది కాదంటూ కోపగించుకున్నారు. మరోవైపు.. ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ కూడా ఖర్ వేషాధారణ, అందంపై భారతీయ మీడియా చూపిన అత్యుత్సాన్ని తప్పుబట్టింది. దాయాదుల మధ్య జరిగిన చర్చల వివరాల కన్నా... ఖర్ అందం, వస్త్రధారణే ఎక్కువ ఆకర్షించాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. చర్చల సారాంశం కంటే ఆమె అందానికే స్థానిక మీడియా సైతం పోటీ పడినట్టుగా పేర్కొంది.