కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై అనుమానిత అల్ ఖైదా తీవ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడి కుట్రను కువైట్ భద్రతా యంత్రాంగం భగ్నం చేసింది. దీనికి సంబంధించి ఆరుగురు తమ దేశ పౌరులను అరెస్టు చేసినట్లు కువైట్ అధికారులు వెల్లడించారు.
తమ దేశంలో అమెరికా స్థావరంపై దాడికి ప్రయత్నం జరిగిందని, అయితే దానిని తాము భగ్నం చేశామని కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. అరెస్టు చేసిన ఆరుగురు కువైట్ పౌరులు అమెరికా స్థావరంతోపాటు, ప్రభుత్వ భద్రతా కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలపై దాడులకు కూడా కుట్రపన్నినట్లు పేర్కొంది.
కువైట్‌లో సుమారు 15 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. పొరుగునున్న ఇరాక్‌లో భద్రతా విధులు నిర్వహించేందుకు అమెరికా సైనికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కువైట్‌లోని అరిఫ్‌జాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై దాడికి కుట్ర పన్నామని అరెస్ట్ అయిన తీవ్రవాదులు అంగీకరించారు. ఈ స్థావరం కువైట్ రాజధానికి సమీపంలో ఉంది. దీనికి సౌదీ అరేబియా దేశ సరిహద్దులు కూడా సమీపంలోనే ఉన్నాయి.