జపాన్ ప్రధానమంత్రి నొవొటో కన్ రానున్న వారాల్లో తన రాజీనామాకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే నెలలో వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవాలనుకున్న తన ఆలోచనను విరమించుకున్నారు. సెప్టెంబర్ ప్రారంభంలో కన్ చేయదలచుకున్న పర్యటన ఏర్పాట్లను జపాన్ విరమించుకుందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నట్లు అమెరికా న్యూస్ పేపర్ ఒకటి కథనాన్ని వెలువరించింది.
జపాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి పర్యటన అసాధ్యమని క్యాబినేట్ ముఖ్య కార్యదర్శి యుకియో ఎదనో పేర్కొన్నారు. మార్చి 11న భూకంపం, సునామీలు సంభవించిన అనంతరం పునరావాస ఏర్పాట్లు చేయడంలో విఫలమయిన ప్రధాని గద్దె దిగాలని ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష సభ్యులు కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కన్ క్యాబినేట్లో 15 శాతం మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారు.