అమెరికా దళాలు మరోసారి పాకిస్థాన్ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలపై విరుచుకపడ్డాయి. తాజాగా అమెరికా జరిపిన డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) దాడిలో 12 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతమయ్యారు. చట్టపాలన లేని పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో తలదాచుకుంటున్న తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులపై అమెరికా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ ప్రభుత్వం తమ భూభాగంలో విదేశీ సేనల దాడులను ఖండిస్తున్నప్పటికీ, అమెరికా దళాలు తరచుగా డ్రోన్ దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా దళాలు వాయువ్య ప్రాంతంలోని దక్షిణ వజీరిస్థాన్‌లో స్థానిక తాలిబాన్ కమాండర్ ఇర్ఫాన్ మెహసూద్ ఇంటిపై డ్రోన్ దాడి చేశాయి.
ఈ దాడిలో 12 మంది తీవ్రవాదులు హతమైనట్లు, మరో ఎనిమిది మంది గాయపడినట్లు మీడియా వెల్లడించింది. గడిచిన నెల రోజుల్లో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికా దళాలు డ్రోన్ దాడి చేయడం ఇది ఐదోసారి. ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు ఇద్దరు తాలిబాన్ కమాండర్లతోపాటు, మొత్తం 28 మంది తీవ్రవాదులను అరెస్టు చేశాయి.