అమెరికా అధ్యక్షుడిగా తొలి విడత పదవీ కాలంలో మూడో సంవత్సరం పాలన అందిస్తున్న బరాక్ ఒబామా కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ భూమిపై అమెరికా అధ్యక్ష పదవి గొప్ప ఉద్యోగమని అభిప్రాయపడ్డారు.
"ఇది భూమిపై గొప్ప ఉద్యోగం. ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. మీరు ఎప్పుడైతే అధ్యక్షుడవుతారో ప్రతి చిన్న సంఘటనకు మీరే బాధ్యత, జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది" అని ఒబామా సీఎన్ఎన్తో పేర్కొన్నారు. అనేక మంది ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం, దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది అద్భుతమైన వ్యక్తులను కలవడం చాలా ఆనందం కలిగిస్తుందని ఆయన చెప్పారు.
2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికై రెండో విడత కూడా పదవిని చేపట్టాలనుకుంటున్న ఒబామాకు ప్రస్తుతం అమెరికాలో ఏర్పడ్డ రుణ సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.