పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన అధికారాల్లో ముఖ్యమైనవి కొన్ని వదులుకోనున్నారు. వాటిలో ప్రధాన సైనికాధికారులను నియమించడం, పార్లమెంటును రద్దు చేయడంలాంటి అధికారాలను ప్రధానికి బదిలీ చేయనున్నట్లు లండన్‌కు చెందిన బ్రిటిష్ పత్రిక వెల్లడించింది.
వాస్తవానికి జర్దారీ తన అధికారాల్లో కొన్నింటిని వదులుకుని, ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీకి అప్పగించాలనుకున్నారు. దీంతో ప్రధానికి, అధ్యక్షుడికి అధికారం సమతుల్యంగా ఉంటుంది. జర్జారీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సమర్ధించాయి.
అధికారం చేజిక్కించుకున్న మిలటరీ పాలకులు రాజ్యాంగాన్ని తమ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటున్నారని వివిధ రాజకీయ పార్టీలు గతంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అధికారంలో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధికార ప్రతినిధి ఫర్హాతుల్లా బాబర్ మాట్లాడుతూ, పార్టీ పరంగా పార్లమెంటు పరంగా ఎలా నిర్ణయిస్తారో, ఆ నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని జరార్దీ అన్నారని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా పాక్ రాజ్యాంగంలోని కొన్ని అంశాలను మార్చేందుకు 28 మంది సభ్యులుగల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.
కాగా జర్దారీ తన అధికారాల్లో గవర్నర్లను నియమించడం, గవర్నర్ పాలనను విధించడం లాంటి అధికారాలను కూడా వదులుకుంటారని ఆయన వివరించారు.
1973లో ఉన్న రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నామని, ఆ తరువాతి కాలంలో అధికారం చేజిక్కించుకున్న జనరల్ జియా-ఉల్-హక్ పాక్ రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారని, దీంతో మిలిటరీ పాలకులు నియంతలుగా మారి రాజ్యాంగాన్ని భృష్టు పట్టించారని ఆయన అన్నారు.
ప్రస్తుతం తాము తమ దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలు తెలుపాలని కోరినట్లు ఆయన తెలిపారు.