ఇరాన్ అమ్ములపొదిలోకి అణ్వాయుధాలు చేరితే మధ్యప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వం ఏర్పడుతుందని అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందితే, ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలు కూడా ఈ ఆయుధ రేసులోకి వస్తాయని పేర్కొన్నారు.
భారత్ 1970వ దశకం ప్రారంభంలో అణు పరీక్షలు నిర్వహించడంతో పాకిస్థాన్ కూడా అణ్వాయుధాల కోసం వేట ప్రారంభించిన సంగతి తెలిసిందే. తదనంతర కాలంలో పాకిస్థాన్ కూడా అణు సామర్థ్యాన్ని సంపాదించుకుంది.
ఇప్పుడు కూడా ఇరాన్ అణ్వాయుధాలు పొందితే మధ్యప్రాచ్య, గల్ఫ్ దేశాలు కూడా అణ్వాయుధాల కోసం వెంపర్లాట ప్రారంభిస్తాయని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ తెలిపారు. ఈ పరిస్థితి మధ్యప్రాచ్య ప్రాంతంలో అస్థిరతకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.