అణు, క్షిపణి పరీక్షల కోసం ఉత్తర కొరియా భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు 700 మిలియన్ అమెరికా డాలర్లను ఈ పరీక్షల కోసం వెచ్చించినట్టు దక్షిణ కొరియా వార్తా పత్రికలు వెల్లడించాయి. ఈ మొత్తం నిధులతో రెండేళ్ళ వరకు ఆహార కొరత లేకుండా చూడొచ్చని ఆ వార్తా పత్రిక పేర్కొంది.
తాజాగా నిర్వహించిన ఏడు పరిక్షల కోసం సుమారు 43 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ఖాతరు చేయని ఇరాన్.. గత శనివారం ఐదు స్కడ్ క్షిపణులను, రెండు రోడాంగ్ మిస్సైల్స్‌ను ప్రయోగించిన విషయం తెల్సిందే.
అలాగే, ఏప్రిల్ ఐదో తేదీన ప్రయోగించిన లాంగ్ రేంజ్ తియోపొడాంగ్-2 క్షిపణి కోసం 300 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు సమాచారం. అలాగే, ఇటీవలి కాలంలో ప్రయోగించిన పది స్వల్పశ్రేణి క్షిపణుల కోసం 10 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు దక్షిణ కొరియా పత్రికలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా, గత మే నెల 25వ తేదీన నిర్వహించిన అణు పరీక్షకు 300-400 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గత 2006 సంవత్సరం తర్వాత ఇది రెండో అణు పరీక్ష కావడం గమనార్హం.