రష్యన్ బలగాలు తమ దేశ రాజధాని కీవ్‌ను అతిత్వరలోనే వశం చేసుకునే అవకాశం ఉండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరో 30 రోజుల పాటు మార్షల్ లా పొడగించేలా బిల్లును ప్రవేశపెట్టారు. రిజర్వు బలగాల కోసం 18 నుంచి 60 యేళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు.
అంతేకాకుండా రష్యన్ బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు ఉక్రెయిన్ చర్యలు తీసుకుంది. మరియుపోల్ నగరానికి సహాయక సామాగ్రి చేరవేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, ఈ యుద్ధం ఇప్పటికే 20 రోజుల వరకు సాగింది. అయితే, మరో పది రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్టయితే ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, రష్యన్ బలగాలు తీవ్రమైన వనరుల కొరతను ఎదుర్కొంటుంది. దీంతో రష్యన్ సేనలు దాడులను స్వయంగా విరమించుకునే అవకాశాలు లేకపోలేదని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ యూరప్ మాజీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోగ్స్ అభిప్రాయపడ్డారు.