అగ్రరాజ్యం అమెరికాలో సంచలనం సృష్టించి అల్లర్లకు కారణమైన ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. జార్జ్ ఫ్లాయిడ్‌ది ముమ్మాటికీ నరహత్యేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన అమెరికా పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేల్చింది. ఆయనకు త్వరలోనే కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.
కాగా, గత యేడాది మే 25వ తేదీన పోలీసు అధికారి డెరెక్ చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మరణించాడు. ఫ్లాయిడ్ మెడను మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా డెరెక్ కాలు తీయకపోవడానికి సంబంధించిన వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు మాజీ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు తాజాగా దోషిగా ప్రకటించింది. ఫ్లాయిడ్ హత్యను సెకండ్, థర్డ్ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొన్న న్యాయస్థానం శిక్షను త్వరలో ఖరారు చేయనుంది.
కోర్టు తీర్పు తర్వాత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తీర్పు సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్ద గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.
ఫ్లాయిడ్ హత్య సమయంలో దోషి డెరెక్‌తోపాటు ఉన్న మిగతా ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదు కాగా, ఆగస్టు నుంచి వారిపై విచారణ జరగనుంది.
కాగా, కోర్టు తీర్పు అనంతరం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించారు. బాధిత జార్జ్ కుటుంబ సభ్యులను అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వైట్ హౌస్‌కు పిలిపించి ఓదార్చడం గమనార్హం.