అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో భారత హెచ్-1బీ దరఖాస్తుదారులకు మరింత కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు దాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలామంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకు వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
డిసెంబరు - జనవరిలో జరగాల్సిన హెచ్-1బీ, హెచ్-4 వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వీరి ఇంటర్వ్యూ తేదీలను ఇప్పుడు అక్టోబరు నెలకు వాయిదా వేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి.. ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు.