భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు భారీ అపరాధం విధించారు. ఈ మొత్తాన్ని బెంగుళూరుకు చెందిన స్టార్టప్ దేవాస్ మల్టీమీడియాకు 102 కోట్ల డాలర్లు చెల్లించాలని పేర్కొంది. ఇంతకీ ఇస్రోకు అపరాధం విధించింది ఎవరన్నదే కదా మీ సందేహం... అమెరికా కోర్టు. ఇస్రోకు చెందిన వాణిజ్య శాఖ యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు ఈ భారీ జరిమానా విధించింది.
రెండు శాటిలైట్లు అభివృద్ధి చేసి, ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో సిగ్నల్ అందించే విధంగా దేవాస్‌తో 2005లో యాంత్రిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ ఒప్పందాన్ని 2011లో యాంత్రిక్స్ రద్దు చేసింది. దీనిపట్ల దేవాస్ మల్టీమీడియా కోర్టులను ఆశ్రయించింది. ఈ కేసులో భారత సుప్రీంను ఆశ్రయించిన దేవాస్‌కు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అయితే తాజాగా సియాటిల్‌లోని వాషింగ్టన్ జిల్లా కోర్టు జడ్జి థామస్ జెల్లీ ఈ కేసులో అక్టోబర్ 27వ తేదీన తీర్పు వెలువరించారు. దేవాస్‌కు 56.2 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాలని, వడ్డీతో కలిపి మొత్తం నష్టపరిహారం 102 కోట్ల డాలర్లు చెల్లించాలంటూ సియాటిల్ కోర్టు తన తీర్పులో యాంత్రిక్స్‌ను ఆదేశించింది.
అయితే కోర్టు పరిధి అంశంలో దేవాస్, యాంత్రిక్స్ మధ్య విభేదాలు ఉన్నా.. అమెరికాలోనూ కోర్టు కేసును వాదించే హక్కు ఉన్నట్లు గతంలో దేవాస్ పేర్కొంది. యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు సియాటిల్‌లో ప్రధాన కార్యాలయం ఉన్నది.