అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో విద్యాభ్యాసం చేసిన వారికే అధిక జీతంభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం హెచ్1బీ వీసాలో కీలక మార్పులు చేయనుంది.
ఇందుకోసం అమెరికాలో విదేశీయులకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే ఈ హెచ్1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన మార్పులు చేస్తూ అక్కడి యంత్రాంగం నవంబరు 30వ తేదీన పలు ప్రతిపాదనలు చేసింది. హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనే కంపెనీలు ముందుగానే యూఎస్సీఐఎస్‌లో ఎలక్ట్రానికల్‌గా నమోదు చేసుకోవాలని అమెరికా ఇటీవల కొత్త నిబంధనను ప్రకటించింది.
దీంతో పాటు అమెరికాలో చదువుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఇతర దేశాల్లో చదువుకుని ఉద్యోగాల కోసం వచ్చే వారికి వీసా క్యాప్ తగ్గించి అమెరికాలో చదువుకున్న వారికి వీసాలు పెంచాలని తాజాగా ప్రతిపాదనలు చేసింది.
ఈ కొత్త నిబంధనల మేరకు హెచ్1బీ వీసాల కోసం చాలా మంది దరఖాస్తులు చేసుకుంటే యూఎస్సీఐఎస్ లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం మొదట అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారి దరఖాస్తుల్లో 20 వేల దరఖాస్తులను ఎంపిక చేస్తారు. తర్వాత మిగిలిపోయిన దరఖాస్తులను.. విదేశీ ఉద్యోగులను ఎంపిక చేసే 65వేల దరఖాస్తుల కోటా లాటరీలో కలుపుతారు.