అమెరికాను ఓ భారీ మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. దేశంలోని నైరుతి ప్రాంతంలోని న్యూ మెక్సికో నుంచి ఈశాన్యంలోని న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 14 కోట్ల మంది ప్రజలపై ఈ తుఫాను ప్రభావం చూపుతోంది.
దేశ జనాభాలో ఇది 40 శాతానికి పైగా కావడం గమనార్హం. శనివారం నుంచి సోమవారం వరకు భారీ హిమపాతం, మంచుతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరించింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డజనుకు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సహాయక బృందాలను, నిత్యావసరాలను సిద్ధం చేసిందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయమ్ తెలిపారు.
న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెరిల్ మాట్లాడుతూ.. "గత కొన్నేళ్లుగా చూడని తీవ్రమైన తుపాను ఇది. ప్రజలు ఇళ్లలోనే ఉండటం మంచిది" అని అన్నారు. తుపాను కారణంగా దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో కలిపి దాదాపు 13,000 విమాన సర్వీసులు రద్దయినట్లు ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ వెల్లడించింది.