ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందులోభాగంగా, భారత్‌తో వాణిజ్యాన్ని బంద్ చేసుకుంది. ఇరు దేశాల మధ్య స్నేహ వారధిగా భావించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. అదేసమయంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంలోనూ పూర్తిగా విఫలమైంది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మనకు సహకారం అందిస్తుందనే భావనలో మూర్ఖుల స్వర్గంలో (ఫూల్స్ ప్యారడైజ్) బతకొద్దని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ మన కోసం ఎవరూ పూల దండలు పట్టుకుని ఎదురుచూడటం లేదన్నారు.
పైగా, భావోద్వేగాలకు గురికావడం, అభ్యంతరాలను వ్యక్తం చేయడం చాలా సులభమన్నారు. సమస్యను అర్థం చేసుకుని ముందుకు సాగడమే కష్టమన్నారు. భద్రతామండలి సభ్యదేశాల్లోని ఏ దేశమైనా మనకు అడ్డుపడవచ్చని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా ఇప్పటికే సంపూర్ణ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా, అగ్రరాజ్యం అమెరికా, చైనా వంటి దేశాలు కూడా ఈ వ్యవహారంలో వేలెట్టడానికి ఏమాత్రం ఆసక్తిచూపలేదు. ఇది వారి అంతర్గత వ్యవహారమంటూ వ్యాఖ్యలు చేసి చేతులు దులుపుకున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఎవరూ అండగా నిలవరనే విషయం పాకిస్థాన్‌కు బోధపడింది. మరోవైపు, పాక్ ప్రభుత్వపై ఆ దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఖురేషీ అసహనం వ్యక్తం చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.