బ్రిటన్ దేశ తదుపరి ప్రధానమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత కొన్ని రోజులుగా సాగుతూ వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని పీఠం కోసం భారత సంతతికి చెందిన రిషి సునక్, ఆ దేశ మాజీమంత్రి లిజ్ ట్రస్‌లు తుదిపోరులో నిలిచారు.
ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. అయితే, బ్రిటన్ మీడియా వర్గాల సమాచారం మేరకు లిజ్ ట్రస్ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరి భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలు శుక్రవారం సాయంత్రంతో ముగిసిన విషయం తెల్సిందే.
కాగా, ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 1.60 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉండగా వీరంతా ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.