ఆప్ఘన్ ప్రజలు అంతర్దుద్ధం సందర్భంగా తీసుకున్న ప్రభుత్వ ఆస్తులు, వాహనాలు, ఆయుధాలనుతిరిగి సంబంధిత శాఖలకు, కార్యాలయాలకు అప్పగించాలని తాలిబన్లు ఆప్ఘన్ పౌరులకు డెడ్ లైన్ పెట్టారు.
దీంతో ఈ వ్యవహారంలో తాలిబన్లకు ఆయుధాలు, వాహనాలు ఏ మేరకు జనం అప్పగిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. ఇప్పటికే ఆప్ఘన్ ప్రభుత్వ కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులతో, ఆయుధాలతో ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నారని భావిస్తున్న తాలిబన్లు వాటిని తక్షణం అప్పగించాలని ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వీటి వల్ల ఇప్పటికిప్పుడు పెనుముప్పేమీ లేకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని తాలిబన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ గడ్డపై నుంచి తాలిబన్లపై పోరాడే వారికి ఉజ్బెకిస్తాన్ తో పాటు పలు పాశ్చాత్య దేశాలు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
తాలిబన్లపై కోపంతో ఉన్న వారంతా ఇలాంటి వారిని చేరదీస్తున్నాయి. వీరు ప్రభుత్వం నుంచి దొంగిలించిన ఆయుధాలతో తాలిబన్లపై పోరుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే వారి నుంచి ఆయుధాలు, వాహనాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులు లాక్కోవాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ పాలనతో పాటు ఆయుధాల్ని, వాహనాల్ని, ఇతర ఆస్తుల్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని తాలిబన్లు నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది.