Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంతటి మహమ్మారి అనుకోలేదు: కరోనా తొలికేసును గుర్తించిన మహిళా డాక్టర్ జంగ్

ఇంతటి మహమ్మారి అనుకోలేదు: కరోనా తొలికేసును గుర్తించిన మహిళా డాక్టర్ జంగ్
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (15:52 IST)
ప్రపంచాన్ని భయ పెడుతున్న కరోనా వైరస్‌ను తొలిసారి గుర్తించినప్పుడు ఇదేదో కొత్త సమస్యలా ఉందని భావించడం వాస్తవమే అయినా ఇంతటి మహమ్మారి అని ఊహించలేదని చైనాలోని వూహాన్ నగరంలో తొలికేసును గుర్తించిన మహిళా డాక్టర్ జంగ్ తెలిపారు.
 
వూహాన్ లోని హుబే ప్రొవెన్షియల్ ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధుల విభాగంలో సీనియర్ వైద్యురాలు, విభాగం డైరక్టర్ అయిన జంగ్ గత ఏడాది డిసెంబర్ 26న తొలి అనుమానిత కేసును గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా లక్షా నలభై ఐదువేల మంది మరణానికి ఈ వైరస్ కారణమైంది.

అలాగే వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలోనే 4,632 మంది చనిపోయారు. అంతటి మహమ్మారి కరోనాను గుర్తించిన 54 ఏళ్ల మహిళా వైద్యురాలు తొలిసారి అక్కడి ఓ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడారు. 
 
సరికొత్త వైరస్ అని అనుమానించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన వైనాన్ని వివరించారు. 'ఆ రోజు సమీపంలోని ప్రాంతం నుంచి వృద్ధ దంపతులు మా ఆసుపత్రికి వచ్చారు. జ్వరం, దగ్గు, నీరసంతో బాధపడుతూ కనిపించారు. ఫ్లూ లక్షణాల్లా అనిపించడంతో తొలుత నేను సాధారణంగానే తీసుకున్నా. మరునాడు వారి సీటీ స్కాన్ నివేదిక వచ్చాక వారికి వచ్చింది ఫ్లూ జ్వరం కాదని అనుమానించాను.
 
ఎందుకంటే ఫ్లూ వైరస్‌కు భిన్నంగా దీని కదలికలు, వ్యాప్తి వున్నాయి. దీంతో అనుమానించిన నేను వారి కుమారుడికి కూడా వైద్య పరీక్షలు అవసరమని గుర్తించి అతనికి తెలియజేశాను.

తాను ఆరోగ్యంగా ఉన్నానని, అనవసరంగా తన వద్ద నుంచి డబ్బులు నొక్కేయడానికి ఇలా చెపుతున్నారంటూ తొలుత అతను పరీక్షలకు నిరాకరించాడు. కాస్త వివరించి చెప్పడంతో అంగీకరించాడు. ముగ్గురి ఊపిరితిత్తుల్లోనూ ఒకేలాంటి లక్షణాలున్న వైరస్ కదలిక నాకు కనిపించింది.
 
సాధారణంగా అంటురోగమైనప్పుడే ఇలా జరుగుతుంది. దీంతో నాలో అనుమానాలు మొదలయ్యాయి. డిసెంబరు 27న మరో రోగి మా ఆసుపత్రికి వచ్చాడు. అతని ఊపిరితిత్తుల్లోనూ ఇదే విధమైన లక్షణాలు కనిపించాయి.

నలుగురికి నిర్వహించిన రక్త పరీక్షల్లో తేలిందేమంటే వైరల్ ఇన్‌ఫెక్షన్లతో వారు బాధపడుతున్నారని. దీంతో నలుగురికీ ‘ఇన్‌ఫ్లూయింజా’ సంబంధిత పరీక్షలు వరుసగా నిర్వహించాం. అన్నింటిలోనూ నెగెటివ్ అని వచ్చింది.
 
దీంతో అదే రోజు ఆసుపత్రి ఉన్నత వర్గాలకు వైరల్ ఇన్‌ఫెక్షన్‌పై నివేదిక ఇచ్చాను. ఆ తర్వాత జిల్లా వైద్యాధికారుల దృష్టికి సమస్య వెళ్లింది. నేను అప్పట్లో ఊహించలేదు. ప్రపంచాన్నే వణికించే వైరస్ తొలి కేసులు అవని' అని జంగ్ తెలిపారు.

ఆమె నివేదిక అనంతరం ఈ నలుగురు బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచడమే కాకుండా వారికి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలు హెచ్చరించాయి.
 
అదే సందర్భంగా జిల్లా అధికారులు విపత్తు నివారణ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో జంగ్ కూడా తన విభాగంలోని వైద్యులు, సిబ్బందికి మాస్క్‌లు ధరించాల్సిందిగా కోరారు. డిసెంబరు 30వ తేదీన వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషనర్ ఓ అత్యవసర నోటీస్ జారీ చేశారు.

'ప్రమాదకరమైన వైరస్ ఒకటి నగరంలో విస్తరిస్తోంది. అందువల్ల అన్నివర్గాల వారు అప్రమత్తంగా వ్యవహరించాలి' అన్నది ఆ నోటీస్ సారాంశం. ఆ తర్వాత వైరస్ ఎలా విస్తరించిందీ, ప్రపంచాన్ని ఎలా భయ పెడుతున్నదీ తెలిసిందేగా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదే నిజమైతే జగన్ ను భగవంతుడు కూడా క్షమించడు: అయ్యన్నపాత్రుడు