ఏం చేసినా తన ప్రత్యేకతను చాటుకునే దుబాయ్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించింది. డీప్ డైవ్ దుబాయ్‌గా పిలుస్తున్న ఈ పూల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నెల 7న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ హమ్‌దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దీనిని ప్రారంభించారు. ఆయనే ఓ వీడియోను కూడా ట్విటర్‌లో షేర్ చేశారు.
డీప్ డైవ్ దుబాయ్ విశేషాలు
ఈ డీప్‌డైవ్ దుబాయ్ స్విమ్మింగ్ పూల్ లోతు 60 మీటర్లు (196 అడుగులు). దీనిని ప్రపంచంలోనే అత్యంత లోతైన పూల్‌గా గిన్నిస్ బుక్ గుర్తించింది. దీనికి సంంధించిన ప్రెస్ నోట్ దుబాయ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది.
ఈ 60 మీటర్ల లోతైన పూల్.. 1.4 కోట్ల లీటర్ల నీటిని నింపవచ్చు. అంతేకాదు ఈ పూల్‌లోపల ఓ నగరం కూడా ఉంది. ఓ పూర్తిస్థాయి అపార్ట్‌మెంట్, గ్యారేజ్, ఆర్కేడ్ కూడా ఇందులో ఉన్నాయి. ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ చేయాలనుకునే వారికి సాయం చేయడానికి అక్కడ ఇంటర్నేషనల్ డైవింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు.
ఆరు గంటలకోసారి నీటి ఫిల్టర్
పూల్‌ను అన్ని వైపుల నుంచి కవర్ చేసేందుకు మొత్తం 56 అండర్‌వాటర్ కెమెరాలు అందులో ఉన్నాయి. స్విమ్మింగ్‌ను ఎంజాయ్ చేయడానికి నీటి లోపల సౌండ్, మూడ్ లైటింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఈ పూల్‌లోని నీటిని ఫిల్టర్ చేస్తారు. దీనికోసం సిలిసియస్ అగ్నిపర్వత శిల, నాసా అభివృద్ధి చేసిన ఫిల్టర్ టెక్నాలజీ, యూవీ రేడియేషన్ ఉంటాయి.
బుకింగ్స్ ఎలా?
ఈ డీప్‌డైవ్ దుబాయ్ ప్రస్తుతం కేవలం ఆహ్వానితులకు మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నెల చివరిలోగా బుకింగ్స్ చేసుకునే అవకాశం లభించనుంది. వాళ్ల వెబ్‌సైట్‌లోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. పదేళ్లు పైబడిన వారికి మాత్రమే అనుమతిస్తారు. బిగినర్స్‌తోపాటు ఫ్రొపెషనల్ డైవర్లు, అథ్లెట్లు కూడా ఈ పూల్‌ను సందర్శించవచ్చు.