అమెరికాలో గన్‌కల్చర్ మరోసారి జడలు విప్పింది. రెండు రోజుల క్రితం నైట్ క్లబ్‌లో కాల్పుల ఘటన మరువక ముందే మరోసారి తూటాలు పేలాయి. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఒక దుండగుడు సూపర్ మార్కెట్‌లో కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పది మంది మరణించారు. ఈ కాల్పులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డెన్వర్‌కు వాయువ్యంగా 30 మైళ్ల దూరంలోని బౌల్డర్‌లోని కింగ్ సూపర్స్ దుకాణంలో స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు బౌల్డర్ పోలీస్ కమాండర్ కెర్రీ యమాగుచి తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఈ భవనానికి చేరుకున్నామని అన్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జేర్డ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
బౌల్డర్‌లో జరిగిన విషాదకర ఘటన పట్ల దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. అక్కడి పరిస్థితులన్ని నిశితంగా గమనిస్తున్నానని జేర్డ్ ట్వీట్ చేశారు.
కాగా, ఇటీవల అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జాత్యహంకారం, వివక్షలపై మౌనం వీడాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు.