ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ తీవ్రవాదులు ఆ దేశంలో క్రమంగా పట్టుసాధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆప్ఘన్ నుంచి గత మే నెలలో తుది విడత విదేశీ బలగాల ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి తాలిబన్‌లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను ఉధృతం చేయసాగాయి. క్రమంగా పట్టుబిగుస్తూ ఇప్పుడు ఏకంగా నగరాలనే తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
ఇటీవలే జరాంజ్ రాష్ట్ర రాజధాని నిమ్రోజ్ సిటీని స్వాధీనం చేసుకున్న తాలిబన్‌లు.. తాజాగా జౌజ్జాన్ రాష్ట్ర రాజధాని షెబెర్‌ఘాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే తాలిబన్‌లు ఆఫ్ఘనిస్థాన్‌లోని రెండు కీలక రాష్ట్రాల రాజధానులను స్వాధీనం చేసుకున్నట్లయ్యింది.
షెబెర్‌ఘాన్‌పై తాలిబన్‌లు పట్టుబిగియడంతో అక్కడి బలగాలు, అధికారులు అంతా నగరం విడిచి పారిపోయారు. తాలిబన్ నాయకుడు అయిన అబ్దుల్ రషీద్ దోస్తుమ్‌కు షెబెర్‌ఘాన్ స్వస్థలం. టర్కీలో మెడికల్ వైద్య పరీక్షలు చేయించుకుని వారం క్రితమే దోస్తుమ్ ఇక్కడికి వచ్చాడు. పక్కా స్కెచ్ వేసి నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.