స్వలింగ పెళ్లిళ్ళకు తైవాన్ ఒకే... గే మ్యారేజెస్ హామీ అమలు దిశగా అడుగులు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ చరిత్ర సృష్టించబోతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేసే దిశగా ఆ దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ అడుగులు వేస్తున్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ చరిత్ర సృష్టించబోతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేసే దిశగా ఆ దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ అడుగులు వేస్తున్నారు.
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా గే (స్వలింగ) పెళ్లిళ్లు నానాటికి పెరిగిపోతున్నాయి. తైవాన్ ప్రజలు కూడా ఇప్పుడు అటువైపే అడుగులు వేస్తున్నారు కూడా. దేశ రాజధాని తైపీ, కవోసియుంగ్ నగరాల్లో ఇప్పటికే అనేక పెళ్లిళ్లు జరిగాయి. అయితే ఇంకా వాటికి అధికారికంగా గుర్తింపు రావాల్సి ఉంది. గే పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును ఇంకా ఆమోదించాల్సి ఉంది.
వాస్తవానికి గే మ్యారేజెస్‌ను అనుమతిచ్చే బిల్లును దేశ పార్లమెంట్‌లో 2005లోనే ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అది పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. 2013లో దానికి మళ్లీ కదలిక రావడంతో పార్లమెంట్ కమిటీ దాన్ని సమీక్షించింది. మళ్లీ అది పెండింగ్‌లో పడిపోయింది. గత మే నెలలో దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన త్సాయ్ ఇంగ్ వెన్, గే పెళ్లిళ్ల చట్టానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మళ్లీ బిల్లుకు కదలిక వచ్చింది.
ఫలితంగా వచ్చే జనవరిలో పార్లమెంట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 113 మంది సభ్యుల్లో 57 మంది సభ్యులు ఆమోదిస్తే సరిపోతుంది. పాలకపక్ష డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ, ఇతర పార్టీలు మద్దతిస్తున్నందున బిల్లు ఆమోదం పొందే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. బిల్లు చట్లరూపం దాలిస్తే ఆసియాలో గే పెళ్లిళ్లను ఆమోదించిన తొలి దేశం తైవాన్ అవుతుంది.