అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిమానులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నందుకు ఏకంగా 30 వేల మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా, ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబరు 22 మధ్య ట్రంప్ 18 భారీ ర్యాలీలను ట్రంప్ నిర్వహించారు. ఈ ర్యాలీల్లో ట్రంప్ అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కారణంగా వేలాదిమంది కరోనా బారినపడ్డారు.
ఈ విషయం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ట్రంప్ ర్యాలీలకు వచ్చిన ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను గాలికి వదిలేశారు. ఫలితంగా ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాల్లో సాధారణం కంటే 30 వేల కేసులు అధికంగా నమోదైనట్టు అధ్యయనకారులు గుర్తించారు.
ర్యాలీ జరగడానికి ముందు, ఆ తర్వాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధ్యయనకారులు.. ర్యాలీ తర్వాత పెద్దమొత్తంలో కేసులు నమోదైనట్టు గుర్తించారు. అలాగే, వైరస్ కారణంగా 700 మందికిపైగా మృతి చెందినట్టు తేల్చారు.
అయితే, మృతులు ర్యాలీలో పాల్గొన్న వారు కాదని, అందులో పాల్గొన్న వారి ద్వారా వైరస్ సోకి మరణించిన వారని తెలిపారు. ట్రంప్‌పై అభిమానంతో ర్యాలీల్లో పాల్గొన్న ఆయన అభిమానులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సర్వే పేర్కొంది.