ప్రేమకు సరిహద్దులంటూ లేవు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యంతో ప్రేమ సరిహద్దులు దాటుతోంది. ఇప్పటికే దాయాది దేశానికి రాజస్థాన్ అమ్మాయి ప్రేమ కోసం వెళ్తే.. అదే పాకిస్థాన్ నుంచి మరో మహిళ భారత్‌కు వచ్చేసింది. మన దేశానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు గాను పాక్ మహిళ సరిహద్దు దాటింది.
తాజాగా మరో ప్రేమకథ సరిహద్దు దాటింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన గావో ఫెంగ్, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన 18 ఏళ్ల జావేద్ మధ్య ప్రేమ పుట్టింది. వారి ప్రేమ కథ స్నాప్‌చాట్‌లో మూడు సంవత్సరాలుగా సాగింది. తాజాగా గావో ఫెంగ్ అనే చైనా అమ్మాయి జావేద్‌ను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దృఢ నిశ్చయంతో, ఆమె భౌగోళిక సరిహద్దులు దాటింది.
చైనా నుండి పాకిస్తాన్ వరకు గావో ఫెంగ్ రోడ్ ట్రిప్ ప్రారంభించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో ప్రయాణిస్తూ, ఆమె చివరకు ఇస్లామాబాద్ చేరుకుంది. మూడు నెలల పర్యటన కోసం ఆమె వీసా ఆమోదించబడినప్పటికీ, తెలియని దేశంలో ఆమెకు ఎదురుచూసిన సవాళ్లు అంతా ఇంతా కాదు.
జావేద్ స్వగ్రామంలో ఉన్న భద్రతా కారణాల వల్ల గావో ఫెంగ్‌ని లోయర్ దిర్ జిల్లాలోని సమర్‌బాగ్ తహసీల్‌లోని అతని మామ ఇంటికి తీసుకెళ్లారు. భద్రతా పరమైన ఇబ్బందులను ఈ యువ జంట ఎదుర్కొంటోంది.