పాకిస్థాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిస్తూ వచ్చిన మరో భాగస్వామ్య పార్టీ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఇమ్రాన్ సర్కారు ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాక్ కొత్త ప్రధానిగా ఆ దేశ ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ బరిలోకి దిగుతున్నట్టు సమాచారం.
ప్రస్థుత పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరిగింది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోయారు కాబట్టి షెహబాజ్ షరీఫ్ త్వరలో ప్రధానమంత్రి అవుతారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చెప్పారు.
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ 2018 ఆగస్టు నెల నుంచి నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇతను 1988లో పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి, 1990లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మళ్లీ 1993లో పంజాబ్ అసెంబ్లీకి షెహబాజ్ ఎన్నికై ప్రతిపక్ష నాయకుడయ్యారు.
1997లో ఇతను తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాకిస్థాన్ ప్రధానిని గద్దె దించేందుకు ఓటింగ్‌కు ముందే ఇమ్రాన్‌ఖాన్ మిత్రపక్షం కూటమి నుంచి వైదొలిగింది. రాజకీయ గందరగోళం మధ్య పాకిస్థాన్ పంజాబ్ సీఎం సర్దార్ ఉస్మాన్ బుజ్దార్ రాజీనామా చేశారు.పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం వాయిదా పడిందని పీటీఐ నేత తెలిపారు.
1999లో సైనిక తిరుగుబాటుతో జాతీయ ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత షెహబాజ్ తన కుటుంబంతో సహా సౌదీ అరేబియాలో స్వయం ప్రవాసంలో సంవత్సరాలు గడిపారు. ఇతను 2007లో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. పీఎంల్ ఎన్ విజయం తర్వాత ఇతను రెండవసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అతని సోదరుడైన నవాజ్ షరీఫ్ పదవికి అనర్హుడయిన తర్వాత షెహబాజ్ పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు.