సౌదీ అరేబియా ప్రజల్లో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని సౌదీ పాలకులు భావించారు. ఇందులో భాగంగా ఎవరైనా తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే… కొన్ని అదనపు రూల్స్ పాటించాల్సి ఉంటుందని సౌదీ ప్రకటించింది.
ఇందులో భాగంగా "పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు"అంటూ సౌదీ అరేబియా పాలకులు ఆదేశాలు జారీ చేసిందని ఆ విషయాన్ని సాక్షాత్తు సౌదీ మీడియానే చెబుతోందని పాకిస్థాన్‌కి చెందిన డాన్ రిపోర్ట్ చేసింది. ఇది తీవ్ర కలకలం రేపుతోంది.
సౌదీ అరేబియాలో ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకూ విదేశీయులను వివాహం చేసుకోవటానికి సౌదీ అరేబియా పురుషులకు ఎటువంటి ఆంక్షలు లేవు. ఎటువంటి ఇబ్బందీ పడేవారు కాదు. ఇప్పుడు సౌదీ ప్రభుత్వం ఈ నాలుగు దేశాలకు చెందిన యువతుల్ని వివాహం చేసుకోవద్దనంటూ ప్రకటించిందనే విషయం సౌదీలోనే కాదు ఆయా దేశాల్లో కలకలం రేపుతోంది.
విదేశీయులను వివాహం చేసుకోవాలనుకునే..అంటే ప్రత్యేకించి సౌదీ పురుషులు ఇప్పుడు కఠినమైన నిబంధనలను ఎదుర్కొంటున్నారని మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్-ఖురాషిని ఉటంకిస్తూ మక్కా దినపత్రికలో ఒక నివేదిక పేర్కొంది.
ఆదేశాలతో ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకుంటే… ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే కఠిన నిబంధనలు అడ్డొస్తాయని మక్కా డైలీ రిపోర్ట్ చేసింది.