ట్రంప్‌పై తిరుగుబాటు ప్రారంభం: 30 అమెరికన్ నగరాల్లో నిరసనలు
అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నూతన దేశాధ్యక్షుడిపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి ముస్లింలు అమెరికాకు రాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆదివారం కనీసం 30 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జర
అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నూతన దేశాధ్యక్షుడిపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి ముస్లింలు అమెరికాకు రాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆదివారం కనీసం 30 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధ్యక్షుడి నిరంకుశ డిక్రీని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వలస ప్రజల తరపున న్యాయవాదులు దేశవ్యాప్తంగా నగరాల్లో నినాదాలు చేస్తూ ప్రదర్శనలు తీశారు.
బోస్టన్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజెల్స్ తదితర ప్రముఖ నగరాల్లో వేలాదిమంది ప్రజలు ట్రంప్ నిర్ణయం పట్ల వ్యతిరేకత తెలుపుతూ వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్ నగరంలో వేలాదిమంది నిరనసకారులు వైట్‌హౌస్ ఎదుట గుమికూడి ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. మన నగర విలువల పరిరక్షణ పేరిట జరిగిన ర్యాలీలో న్యూయార్క నగర మేయర్ బిల్ డి బ్లాసియో స్వయంగా పాల్గొన్నారు. ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోనికి ప్రవేశించకుండా ట్రంప్ తీసుకొచ్చిన ఆదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని సెనేటర్ చార్లెస్ ష్కూమర్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ ఆదేశాలను గుడ్డిగా పాటించే ప్రసక్తేలేదని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో వారం క్రితమే కుండబద్దలు కొట్టారు. ట్రంప్ తీసుకువచ్చే వివాదాస్పద నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని, అక్కడే వాటి గురించి తేల్చుకుంటామని ఓ ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. తాము అందుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటామో కూడా వివరించారు.
‘‘వలసదారులపై ఫెడరల్ ప్రభుత్వమే చర్యలు తీసుకునేలా నగరాలకు ఉన్న ప్రత్యేక హోదా, వాటి న్యాయ పరిధిని తొలగించాలని ట్రంప్ భావిస్తున్నారు. న్యూయార్క్ పోలీస్ (ఎన్‌వైపీడీ)కు వచ్చే నిధుల్లో కోత పెట్టాలని అనుకుంటున్నారు. అదేజరిగితే దీనిపై కోర్టులకు వెళ్తాం. మా ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి నిర్ణయాలు ఫెడరల్ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఇది దీనిపై కోర్టుల్లో మాకే అనుకూలంగా తీర్పు వస్తుందనే గట్టినమ్మకముంది. చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వలసదారులను వెనక్కు పంపండం వంటి తీవ్ర చర్యలు తీసుకోం. తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిని తప్పకుండా వెనక్కి పంపిస్తాం’’ అని బ్లాసియో పేర్కొన్నారు.
ట్రంప్ తీసుకున్న, తీసుకోబోయే అత్యంత వివాదాస్పద, ఏకపక్ష నిర్ణయాలను అడుగడుగునా అడ్డుకునేందుకు రాష్ర్టాలు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లింలు అమెరికాకు రాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను యూఎస్ డిస్ర్టిక్ట్ కోర్టు నిలిపివేసిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ట్రంప్ ఆడిందే ఆటగా కొనసాగే అవకాశంలేదని స్పష్టం అవుతోంది.
ముస్లింలకు స్వాగతం పలుకుదాం.. వారిని అమెరికాలోకి ప్రవేశించనిద్దాం అంటూ బోస్టన్ మేయర్ మార్టీ వాల్ష్ ట్వీట్ చేశారు. ట్రంప్ ఆదేశాన్ని రద్దు చేయనంతవరకు మేం వెనక్కు తగ్గేది లేదు. ట్రంప్ వలస ప్రజలపై తీసుకొచ్చిన చట్టం అమెరికాలోని వలస ప్రజలు, వారి కుటుంబ సభ్యుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని వర్జీనియా స్టేట్ న్యాయవాదుల బృందం డైరెక్టర్ మిషెల్ లార్యు పేర్కొన్నారు.
అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాలు లాస్ ఎంజెల్స్, చికాగో, న్యూయార్క్‌లను నిరసనకారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టౌన్ స్క్వేర్‌లలో, బంగోర్, మైనే, బ్లూమింగ్టన్, ఇండ్, బోయిసి వంటి చిన్న విమానాశ్రయాల్లోనూ నిరసనకారులు గుమికూడా నిరసన తెలిపారు.
ఫెడరల్ జడ్జి అన్ డోన్లీ వలస ప్రజల నిషేధ డిక్రీపై అత్యవసర స్టే విధించినప్పటికీ విమానాశ్రయాల నుంచి అమెరికా లోకి వలస ప్రజలను అనుమతించకపోవడం అమెరికన్లలో చాలామందిని ఆగ్రహంలో ముంచెత్తుతోంది.