భర్త 3వ ఫ్లోర్‌లో, భార్య 14వ అంతస్థులో.. సతీమణిని కడసారి చూశాడు.. ప్రాణాలు వదిలాడు..
ఆస్పత్రి మంచాలపై ఉన్నా.. మృత్యు ఒడిలోకి చేరుకోబోతున్నానని తెలిసినా.. లేచి నడవలేని స్థితిలో ఉన్నా.. తన భార్యను చూశాక కన్నుమూయాలనుకున్న 92 ఏళ్ల వృద్ధుడి కథ ఇది. ఇలా తన భార్యను చూసిన 2 గంటల్లో ఆ వృద్ధుడు
ఆస్పత్రి మంచాలపై ఉన్నా.. మృత్యు ఒడిలోకి చేరుకోబోతున్నానని తెలిసినా.. లేచి నడవలేని స్థితిలో ఉన్నా.. తన భార్యను చూశాక కన్నుమూయాలనుకున్న 92 ఏళ్ల వృద్ధుడి కథ ఇది. ఇలా తన భార్యను చూసిన 2 గంటల్లో ఆ వృద్ధుడు కన్నుమూశాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని నింగ్బో ప్రాంతానికి చెందిన ఫెంగ్ (92) అనారోగ్యానికి గురై ఇంగ్‌జు పీపుల్స్ ఆస్పత్రిలో చేరారు.
అదే సమయంలో ఆయన భార్యకు ఎముక విరగడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫెంగ్ 3వ ఫ్లోర్‌లోని ఐసీయూలో, ఆయన భార్య 14వ ఫ్లోర్‌లో చికిత్స పొందుతున్నారు. సుమారు నెల రోజుల పాటు ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో ఉన్నా చూడటానికి, మాట్లాడుకోవడానికి వీలు పడలేదు.
ఈ నేపథ్యంలో ఫెంగ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన శరీర భాగాలు పనిచేయడం మానేశాయి. దీంతో ఫెంగ్ తాను ఎక్కువ కాలం బతకనని తెలుసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లమన్నాడు. వెంటనే కుటుంబసభ్యులు డాక్టర్లతో సంప్రదింపులు జరిపి ఫెంగ్‌ను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కానీ ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లే ముందు ఫెంగ్ ముఖం చిన్నబోయింది. దీన్ని గమనించిన కుమార్తె చికిత్స కొనసాగించమంటావా అని తండ్రిని అడిగింది. కానీ ఫెంగ్ అసలు కారణం చెప్పాడు.
భార్యను చూసి చాలా కాలమైందని, ఆమెను ఎంతో మిస్సవుతున్నానని, చివరిగా ఆమెను చూడాలని ఉందన్నాడు. ఆమె వైద్యులతో సంప్రదింపులు జరపగా వారు అంగీకరించడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫెంగ్ భార్యను స్ట్రెచర్ మీద ఐసీయూకి తీసుకొచ్చారు. వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఓ నర్సు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
2016 అక్టోబరు 24న ఫెంగ్ ఉన్న వార్డులోకి ఆయన భార్యను తీసుకొచ్చారు. వృద్ధ దంపతులు ఇద్దరూ చూసుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఆ వృద్ధురాలు భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని... నా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను నిన్ను వెతుక్కోవాలి అంటూ బోరున విలపించింది. అనంతరం ఫెంగ్‌ను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫెంగ్ మృతి చెందాడు. ఫెంగ్ ఫోటోకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. కామెంట్స్ కూడా జోరందుకుంటున్నాయి. ఇప్పటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.