పాకిస్థాన్ దేశంలో రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలకు మరణశిక్ష విధించారు. ఈ ఆశ్చర్యకర ఘటన కరాచీలో జరిగింది. ఈ కుక్కలకు ఉరిశిక్ష వేయడానికి కారణం కరాచీలోని ఓ లాయర్‌పై దాడి చేయడమే.
గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన లాయర్ మీర్జా అక్తర్‌పై ఈ రెండు కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వాటిని ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిని విమర్శిస్తూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై లాయర్ అక్తర్ కోర్టుకెళ్లడంతో కుక్కల యజమాని రాజీకొచ్చాడు.
అయితే కోర్టు బయట సెటిల్మెంట్‌లో భాగంగా ఆ కుక్కలకు మరణశిక్ష విధించడానికి అంగీకరించి లాయర్‌తో వాటి యజమాని రాజీకొచ్చారు. అయితే రాజీకి అంగీకరిస్తూనే పలు షరతులు విధించారు. ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని కోరారు.
అంలాగే, ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దని సదరు యజమానికి లాయర్ అక్తర్ షరతులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో సమర్పించారు. అయితే ఈ ఒప్పందంపై హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.